జగన్ ‘వ్యూహాత్మక’ తప్పిదం-పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు

ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నోరు జారారా? రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరని, పవన్ పెళ్లిళ్ల విషయాన్ని లాగడం ప్రతిపక్ష నేతకు తగదని చెబుతున్నారు.
జగన్ కావాలనే వ్యూహాత్మకంగా ఆ వ్యాఖ్యలు చేశారా?
జనసేనపై మైండ్ గేమ్‌లో భాగంగా చేశారా?
లేక మీడియాతో మాట్లాడుతూ.. అలా మాట్లాడేశారా? అనే చర్చ సాగుతోంది.
టీడీపీతో నాలుగేళ్లు సఖ్యతతో ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల హఠాత్తుగా చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పవన్ రివర్స్ కావడంతో టీడీపీ ఇమేజ్ బాగా దెబ్బతిన్నదనే వాదనలు ఉన్నాయి. పవన్ క్రమంగా తన మాటల దాడిని జగన్‌పై కూడా పెంచుతున్నారని, అందుకే ముందుగానే ఎదురుదాడి ప్రారంభించారని, అందులో భాగంగా చేసిన వ్యాఖ్యలు రివర్స్ అయ్యాయని అంటున్నారు. తనదాకా మరింత ఘాటుగా వచ్చే వరకు వేచి చూడకుండా, ముందుగా మేల్కొందామనుకుంటే అసలుకే ఎసరు వచ్చిందని అంటున్నారు. జగన్ వ్యాఖ్యలపై పవన్ కూడా హుందాగా స్పందించారు. జగన్ ఫ్యామిలీపై మాటలు విడువొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి కూడా చేశారు.
సభలో పోరాడమని వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రజలు పంపిస్తే వారు ఇక్కడ అసెంబ్లీకి వెళ్లకుండా, అక్కడ పార్లమెంటుకు రాజీనామా చేసి పారిపోయారని, నేను కనుక అలా చేసి ఉండేవాడిని కాదని పవన్ ఇటీవల అన్నారు. సభలో పోరాడే మంచి అవకాశాన్ని జగన్ పోగొట్టుకున్నారన్నారు. అంతేకాదు, జగన్ ఏమైనా అంటే తాను సీఎం అయ్యేదాకా ఆగాలని అంటాడని పదేపదే విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తిన జగన్.. పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అంటున్నారు.
అసెంబ్లీలో పోరాడకపోవడాన్ని కేవలం పవన్ కళ్యాణే కాదు.. ఉండవల్లి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలు కూడా తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజలు గెలిపించింది సభలో పోరాడేందుకని, సభకు వెళ్లకుండా ఉండేందుకు కాదని గతంలో అన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పవన్ టీడీపీ, వైసీపీకి ధీటుగా ఎదుగుతుండటంతో.. నిన్నటి దాకా విమర్శలతో టీడీపీకి నష్టం జరిగితే, ఇలాగే తనను అంటే వైసీపీకి నష్టం జరుగుతుందనే ఒత్తిడి లేదా వ్యూహాత్మకంగా జనసేను దెబ్బకొట్టాలనే వ్యూహంలో భాగంగా జగన్ ఆ వ్యాఖ్యలు చేసి తప్పులో కాలేశారని అంటున్నారు.
టీడీపీ, బీజేపీ, వైసీపీలపై పవన్ కళ్యాణ్ మాటల దాడిని చూస్తుంటే ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ బీజేపీకి దగ్గర అని టీడీపీ నేతలు ఎంతగా చెబుతున్నప్పటికీ.. ఆయన లెఫ్ట్ పార్టీకి దగ్గరవుతున్నందున ఆ మాటలు ఎవరూ నమ్మడం లేదని అంటున్నారు. అలాగే, టీడీపీతో నాలుగేళ్లు మైత్రితో ఉంటూనే నిలదీసి, హఠాత్తుగా ఆ పార్టీకి గట్టి షాకిచ్చారు. ఆ తర్వాత నుంచి టీడీపీపై మాటల దాడి చేస్తున్నారు. జగన్‌పై కూడా అడపాదడపా విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ నుంచి మరింత గట్టిదాడి జరగకముందే జగన్ ముందు జాగ్రత్తపడదామనుకున్నారా అనే చర్చ సాగుతోంది. వ్యక్తిగత వ్యవహారాల్లోకి దూరడం చాలామంది తప్పుపడుతున్నారు.
తనపై జగన్ వ్యక్తిగతంగా దాడి చేసినప్పటికీ పవన్ అలాంటి దాడి చేయలేదు. తొలుత జగన్‌పై తీవ్రంగానే విరుచుకుపడ్డారు. కానీ ఆ తర్వాత అభిమానులు జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం తెలిసి హుందాగా వ్యవహరించారు. జగన్ ఇంటి ఆడపడుచులను టార్గెట్ చేయవద్దని కోరారు. ఇంతటితో ఈ అంశానికి ముగింపి పలకాలని కూడా కోరారు. కాగా, గతంలోను పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా ధీటుగానే స్పందించారు. ఆ తర్వాత వారు కూడా మౌనం దాల్చారు. కానీ జగన్ మళ్లీ చాన్నాళ్లకు వ్యక్తిగత దాడి చేయడం విమర్శలకు తావిచ్చింది.