2జీ స్పెక్ట్రమ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది
యూపీఏ ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ ట్రయల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. తమ తప్పేమీ లేకపోయినా తమ స్పెక్ట్రమ్ లైసెన్సులు రద్దు చేసినందుకుగాను తమకు రూ.17,000 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరూతూ ఈ కుంభకోణం వ్యవహారంలో నష్టపోయిన ఆయా టెలికాం కంపెనీలు కోర్టు మెట్లు ఎక్కబోతున్నాయి.
ఈ నేపథ్యంలో వీడియోకాన్ టెలికాం కంపెనీ ప్రభుత్వం నుంచి రూ.10,000 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుండగా, లూప్ టెలికాం కూడా రూ.4,000 కోట్లు నష్టపరిహారం కింద చెల్లించాలని కోరనుంది. ఈ కంపెనీలు గతంలోనే నష్టపరిహారం కోరుతూ టెలికాం డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ అప్పీలేట్ ట్రిబ్యునల్(టీడీశాట్)లో కేసు దాఖలు చేశాయి. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతున్నందున, కేసు కోర్టు విచారణలో ఉన్నందున తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేమంటూ టీడీశాట్ అప్పట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయా టెలికాం కంపెనీలకు జవసత్వాలు వచ్చినట్లయింది. దీంతో తాము గతంలో దాఖలు చేసిన కేసులను మళ్లీ తిరగదోడేందుకు ఈ కంపెనీలు తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి.
లైసెన్సుల రద్దుతో కుదేలైన వీడియోకాన్… 2012లో సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 టెలికాం లైసెన్సుల్లో 21లైసెన్సులు వీడియోకాన్ టెలికాం కంపెనీవి. ఆరు సర్కిల్స్ లో టెలికాం సేవల కోసం కంపెనీ అప్పట్లోనే ఈ లైసెన్సుల కోసం రూ.1,500 కోట్లు చెల్లించింది. నిజానికి ఈ కంపెనీ టెలికాం వ్యాపారంలోకి ప్రవేశించేందుకు రూ.25,000 కోట్ల రుణాలు తీసుకుంది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో వీడియోకాన్ ఆ లైసెన్సులను 2012 నవంబరులో భారతి ఎయిర్ టెల్ కు రూ.2,221.44 కోట్లకు విక్రయించింది. టెలికాం లైసెన్సుల రద్దుతో తీవ్రంగా ఆదాయన్ని నష్టపోయినందున తమకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వీడియోకాన్ 2015లోనే టెలికాం ట్రిబ్యునల్‌లో వీడియోకాన్ కేసు దాఖలు చేసింది. ‘‘మాకు ఎంత లేదన్నా రూ.10,000 కోట్లకుపైనే నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఈ నష్టపరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేయాలనుకుంటున్నాం..” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
2008లో యూపీఏ ప్రభుత్వం హయాంలో 2జీ స్పెక్ట్రమ్ వేలం జరిగింది. ఆ తరువాత 2జీ స్పెక్ట్రమ్ వేలంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా రాజీనామా చేశారు. ఈ కుంభకోణం కేసులో 2012లో సుప్రీంకోర్టు ఆయా టెలికాం కంపెనీలకు చెందిన 122 లైసెన్సులను రద్దు చేసింది. దీంతో టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా సీబీఐ ట్రయల్ కోర్టు 2జీ కుంభకోణం కేసు ఊహాజనితంగా ఉందని, సీబీఐ సరైన ఆధారాలు సమర్పించలేకపోయిందని చెబుతూ ఈ కేసులో నిందితులుగా ఉన్న టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, కనిమొళి సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.